మూడు దశాబ్దాలుగా ఉత్తర, దక్షిణ భాషా సినీరంగాల్ని ఏలుతున్న తలైవా సూపర్‌స్టార్ రజనీకాంత్, హైదరాబాద్ పతాకాన్ని వినువీధిలో ఎగరేసిన టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా, హాలీవుడ్ తారగా మారిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా, ప్రముఖ పత్రికాధినేత రామోజీరావు, తెలుగు-హిందీ సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన పౌరపురస్కారాల కార్యక్రమంలో మొత్తం 56 మంది పురస్కార గ్రహీతలను సత్కరించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రజనీకాంత్, రామోజీరావు, మాజీ డీఆర్డీవో చీఫ్ వీకే ఆత్రే, ప్రముఖ గాత్రవిద్వాంసురాలు గిరిజాదేవి, చెన్నై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ వీ శాంత భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. సానియా మీర్జా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ, విద్యావేత్త ఇందూజైన్, అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ డీ బ్లాక్విల్, బాలీవుడి గాయకుడు ఉదిత్ నారాయణ్, మణిపురీ నాటక రచయిత హేస్నామ్ కన్హయ్యలాల్, ప్రముఖ శిల్పి రాంవంజి సుతార్, ఇండాలజిస్టు ఎన్నెస్ రామానుజ తాతాచార్య, చిన్మయ మిషన్ అంతర్జాతీయ విభాగాధిపతి స్వామి తేజోమయానంద, వేదాంత ప్రబోధకుడు దయానంద సరస్వతి (మరణానంతరం) పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
No comments:
Post a Comment