Header Navigation

Thursday, August 25, 2016

ఉత్తమ్... దమ్ముంటే రా..!

తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే దాన్ని బయట పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. నిజాయితీ ఉంటే.. దమ్ముంటే.. ఆ ఒప్పంద పత్రాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకురావాలని, ఒప్పందం నిజమే అయితే తాను ఇంటికి కాకుండా నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పిస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం లభించింది. పలు జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాష్ట్రానికి చిరకాలం, కలకాలం పచ్చని పంటలు పండించే వరప్రదాయని ఈ ఒప్పందం. ఈ రెండేళ్ల కాలం గడిస్తే కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లాకు నీరొస్తే.. మొగులుకు ముఖం పెట్టే పరిస్థితి పోతది. మన పంటలు ఎండని పరిస్థితి ఉంటది. వర్షాలు కురిసినా, కురవక పోయినా వ్యవసాయ రంగంలో తెలంగాణ బ్రహ్మాండంగా ముందుంటది. ఇంత మంచి ఒప్పందాన్ని చాలా ఓపిక, సంయమనం, సామరస్యం, డిప్లమసీతో గత ఏడాదిన్నరగా కష్టపడి చేసుకున్నం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నరు. కానీ కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయి.

Read For More News: visit Sakshi Newspaper

No comments:

Post a Comment